Tuesday, August 14, 2018

కొత్తపల్లి ఆగష్టు 2018 (july 2018) సంచికలో ప్రచురించబడిన మా విద్యార్థుల కథలు ...

కొత్తపల్లి ఆగష్టు 2018 (july 2018) సంచికలో ప్రచురించబడిన మా విద్యార్థుల కథలు ...


ఈ కథ లింక్

మంచి రైతు

రచన:సి.హెచ్‌.ఆవులరాజు, 7వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాల, కంకణాలపల్లి
దొండపాడు గ్రామంలో రాజు అనే పిల్లవాడొకడు ఉండేవాడు. వాడికి చదువు అంతగా రాదు; ఆటలు బాగా ఆడతాడు గానీ. ముఖ్యంగా వాడికి క్రికెట్ అంటే చాలా ఇష్టం.
పిల్లలంతా వాడిని 'మొద్దోడు' అని ఎగతాళి చేసేవాళ్ళు. వాళ్ళ అమ్మా. నాన్న కూడా ఎప్పుడూ‌ తిడుతూనే ఉండేవాళ్ళు వాడిని: "నీకు అటు చదువూ రాదు; ఇటు పొలం పనులూ రావు! నువ్వు దేనికీ పనికి రావు!" అంటూ. అయినా అట్లాగే తరగతులు మారుతూ మారుతూ 10వ తరగతికి చేరాడు రాజు.
పదో తరగతికి రాగానే ఇంటి వాళ్లతో‌ పోరాడి, ఆ సంవత్సరం ఇక బడికి ఇంట్లోంచి రాకుండా హస్టల్‌లో చేరాడు. హాస్టల్‌లో వాడిని తిట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు. దాంతో వాడు చదువుమీద బాగా ధ్యాస పెట్టగలిగాడు: "నేను ఎట్లా చదువుతాను?!" అన్న ఆలోచన వదిలేసి, "నేరుగా చదవటం" మొదలుపెట్టాడు వాడు. దాంతో పదో తరగతి పాసయ్యాడు!
అయితే దానికి ఇంట్లో వాళ్ళు బాధ పడ్డారు: "వీడిని ఇప్పుడు ఇంటర్లో చేర్చాలి, ఖర్మ" అంటూనే ఇంటర్లో చేర్చారు. 
అట్లా అట్లా ఇంటర్‌ చదివాడు రాజు. అటుపైన డిగ్రీలో "వ్యవసాయ చదువు" చదివాడు. అయితేనేం లాభం?! తను చదివిన చదువుతో ఉద్యోగం ఏమీ రాలేదు! కానీ‌ వాడికి నిరాశ అనిపించలేదు. "ఇంక చదువు చాలు" అనుకొని, దొండపాడు తిరిగి వచ్చేసాడు. "ఇంకా ఉద్యోగం రాలేదా? నీకెక్కడ వస్తుందిలే!" అని ఎగతాళిగా మాట్లాడారు అందరూ.
తర్వాతి రోజున పొలానికి వెళ్ళాడు రాజు. వాళ్ళ నాన్నకు రెండెకరాల పొలం ఉంది. అయితే, దాన్నంతా పండించడం కష్టమయి, ఒక ఎకరంలోనే పంట వేసేవాడు ఆయన.
" నాన్నా! ఆ మరో ఎకరాలో నేను సొంతగా ఏదైనా పంట వేద్దామనుకుంటున్నాను" అన్నాడు రాజు,వాళ్ళ నాన్నతో.
"ఏమీ చేతకానోడివి ఏం పండిస్తావురా?" ఎక్కిరిస్తున్నట్లు అన్నాడు వాళ్ల నాన్న. అయినా రాజు ముఖంలో పట్టుదల చూసి, "సరే! అయినా ఆ ఎకరా ఎట్లాగూ ఖాళీయే! ఏమన్నా చావు! ఇప్పటికైనా నీకు చదువు రాదని ఒప్పుకున్నందుకు సంతోషం! కనీసం కూలీ చేయడమన్నా నేర్చుకో" అని తిట్టాడు.
రాజు అవి ఏమీ పట్టించుకోలేదు- తను చదువుకున్న చదువుని ఉపయోగించు-కుంటూ ఆ పొలంలో పంట వేశాడు. రాజు వేసే పంటలు, మందులు, చేసే పనులు అన్నీ కొత్త కొత్తగా అనిపించాయి వాళ్ళ నాన్నకు. '
పిచ్చోడు- ఏంటేంటో చేస్తున్నాడు!' అని బాధ పడసాగాడు. ఊర్లో వాళ్ళు కూడా ఏవేవో‌ ఊహించుకున్నారు. అయితే అట్లా ఆర్నెల్లు తిరిగే సరికి, అందరూ ఒకటే ఆశ్చర్యపోయారు: అందరూ రెండెకరాల్లో పండించే పంటని, రాజు ఒక్క ఎకరంలోనే పండించి చూపించాడు! ఇక ఆ రోజు నుండీ వాళ్ళ నాన్న కూడా రాజుని మెచ్చుకోసాగాడు.
ఈసారి రెండెకరాలూ తననే పండించమన్నాడు. అదనంగా ఆ చుట్టుప్రక్కల వాళ్ల పొలాల్ని కూడా కౌలుకు తీసుకుని అనేక రకాల పంటలు పండించి చూపాడు రాజు.
ఆ తర్వాతి ఏడాది రాజుకి పెళ్లి కూడా అయ్యింది. ఇప్పుడు రాజు ఒక మంచి రైతు! ఊళ్ళోవాళ్ళకు వ్యవసాయంలో‌ఎలాంటి సందేహాలొచ్చినా రాజు దగ్గిరికి వచ్చి సలహాలు అడుగుతుంటారు! 


ఈ కథ లింక్

పిల్లాడు-పిచ్చుక

రచన: బి.వి.శివ శ్రావణి, 5వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాల, కంకణాలపల్లి

నది ఒడ్డున చెట్టు మీద రెండు పిచ్చుకలు ఉండేవి. అవి మంచి స్నేహితులు.
రెండూ కలిసి పుల్లలు తెచ్చుకున్నాయి; రెండూ కలిసి గూడు కట్టుకున్నాయి; చాలా కాలం కలిసి బ్రతికాయి.
ఒకనాడు ఉదయాన్నే ఒక పిచ్చుక నిద్ర లేచింది. చుట్టూ చూసింది. వాతావరణం చాలా బాగా అనిపించింది. నదిలో ఉన్న పూలను, మొక్కలను చూస్తూ సంబరపడింది.

నీళ్ళలో తన నీడ చూసుకుందామని, క్రిందకు వంగింది. అంతే- పొరపాటున కాలు జారి నదిలో పడిపోయింది!
నది బాగా వేగంగా పోతోంది; దానికి ఈత కూడా రాదు! దాంతో అది నదిలో కొట్టుకుపోయింది.
కొంచెం సేపటికి రెండవ పిచ్చుక నిద్రలేచింది. మిత్రుని కోసం చూసింది. మిత్రుడు లేడు. 'ఎక్కడికి వెళ్ళాడబ్బా ఇంత పొద్దున్నే?' అనుకుంది. ఎంత సేపు వేచి చూసినా స్నేహితుడు తిరిగి రాలేదు. చివరికి అది ఆందోళన పడింది. చుట్టూ వెతికింది.
తన ఫ్రెండ్‌ ఎక్కడా కనపడలేదు. అటూ ఇటూ ఎగిరి వెళ్ళి చూసింది. ఎక్కడా దొరకలేదు. బాధ పడుతూ ఒకచోట కూర్చుని ఏడుస్తున్నది.
అంతలో అటుగా వచ్చాడు రాము. వాడికి ఒక్క అవ్వ తప్ప వేరే ఎవ్వరూ లేరు.
"ఎందుకు ఏడుస్తున్నావ్?" అని అడిగాడు దూరం నుండే.
"నా ఫ్రెండ్ కనిపించట్లేదు" అన్నది పిచ్చుక.
"నా ఫ్రెండూ కనిపించట్లేదు. నేను ఏడుస్తున్నానా?" అన్నాడు రాము- "ఇదిగో, ఈ కాసిని సెనగలు ఉన్నై నా దగ్గర- తిను" అని దానికి వేస్తూ.

పిచ్చుక ఏమీ అనలేదు. సెనగలు తినలేదు.
"ఏడవకు" అని దాన్ని నిమిరాడు రాము.
"ఇకమీద నువ్వు-నేను ఒకరికొకరం స్నేహితులం సరేనా?" అన్నాడు.
పిచ్చుకకు ఏడుపొచ్చింది. కానీ దానికి రాము తన స్నేహితుడు అని అర్థం అయింది.